తిరుమల వివాదం.. కొడాలి నాని వివరణ

Update: 2019-11-22 15:59 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొండంత వివాదం రాజుకుంది. తిరుమలలో నిబంధనలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి క్షమాపణలు చెప్పితీరాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అటు ప్రభుత్వం కూడా దీటుగా కౌంటర్ ఇస్తోంది. దేవుడిని, మతాలను రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేసింది. అటు తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని కొడాలి నాని వివరణ ఇచ్చారు.

తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలివి. తిరుమలలో పర్యటించేందుకు ఎవరికి అఫిడవిట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వందల ఏళ్ల నుంచి ఉన్న సంప్రదాయాలను, నిబంధనలను స్వయంగా మంత్రే ధిక్కరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక క్షేత్ర పవిత్రతను కించపరిచేలా మంత్రి మాట్లాడారని.. దీనికి వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్‌ చేసింది.

మంత్రి కొడాలి నాని అసభ్య పదజాలంతో తిరుమల క్షేత్రం గురించి మాట్లాడరని మండిపడ్డారు బీజేపీ నేతలు.. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. స్వయంగా తాను క్రిస్టియన్‌ అని ప్రకటించుకున్న సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమల దర్శనానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు.

మంత్రి కొడాలి నాని మాత్రం తాను తిరుమల గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నారు. అఫిడవిట్‌ విషయంలో జగన్‌ను ప్రశ్నించడానికి చంద్రబాబుకు ఏం అధికారం ఉందని అని మాత్రమే తాను ప్రశ్నించానని కొడాలి నాని స్పష్టం చేశారు.

దేవుడిని, మతాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఇప్పటి వరకు ఇసుక, ఇంగ్లీష్.. ఇప్పుడు కొత్తగా జెరూసలెం యాత్ర, తిరుమలను రాజకీయం చేయడం మానాలని హితవుపలికారు.

వాస్తవానికి తిరుమలలో అన్యమతస్తులు ప్రవేశించేముందు డిక్లరేషన్‌ ఇవ్వాలన్న నిబంధన ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. బ్రిటిష్‌ కాలంలో భారత్‌కు వచ్చిన వారు సైతం ఈ నిబంధన పాటించాకే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా.. స్వయంగా మంత్రే దీన్ని ధిక్కరించేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటున్నారు భక్తులు.

Similar News