ఈ మధ్యకాలంలో ఛార్జింగ్ పెట్టిన సమయంలో కొన్ని ఫోన్లు బాంబుల్లా పేలుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఛార్జింగ్ లో పెట్టకపోయినా ఓ ఫోన్ పేలిపోయింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఈశ్వర్ చావన్.. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రెడ్‌మి నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసినట్లు చావన్ తన పోస్టులో పేర్కొన్నాడు. అయితే ఆ ‘కొత్త ఫోన్ ఆఫీసు టేబుల్ మీద పెడితే సడన్‌గా ఏదో కాలుతున్న వాసన గమనించానన్నాడు..
అయితే అకస్మాత్తుగా ఫోన్ నుంచి మంటలు చెలరేగాయని.. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో లేదని అతను తెలిపాడు. వెంటనే ఆయన థానేలోని షావోమి షోరూంకి వెళ్లి కంప్లైంట్ చేశాడు. ఐదు రోజుల తరువాత, బ్యాటరీలో సమస్య ఉందని కంపెనీ చెప్పిందని చావన్ పేర్కొన్నారు. బ్యాటరీ లోపం, తయారీ లోపం వల్లే ఇలా జరిగిందని అతను ఆరోపిస్తున్నాడు. అయితే షావోమీ స్పందిస్తూ..నాణ్యతకు, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది.