విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల నిర్వాకం పరాకాష్టకు చేరింది. మొన్నటి వరకు గజపతినగరంలో టీడీపీ హయాంలో నిర్మించిన శిలాఫలకాన్ని తీసి పడేస్తే.. తాజాగా మెరకముడిదం మండలం సిరిపురం పంచాయతీ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం దిమ్మకు వైసీపీ జెండా రంగులు వేశారు. దీంతో వైసీపీ నేతలు చేస్తున్న పనులు, వ్యవహరిస్తున్న తీరు వింతగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గాంధీ విగ్రహం ఉన్న దిమ్మను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేయడం ఎంత వరకు సమంజసం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజర్గంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.