బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి అసలు కారణం..

Update: 2019-11-23 12:40 GMT

హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. ఫ్లైఓవర్‌ పైనుంచి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారు తునా తునకలు కాగా, చెట్టు కూడా విరిగి పడింది. అదుపు తప్పిన కారు మెరుపు వేగంతో కిందున్న కార్లపై పడింది. దీంతో కిందున్న కార్లన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన కొంతమంది కారు కింద పడుతుండటాన్ని చూసి పరుగులు తీయగా.. మరికొందరు మాత్రం తప్పించుకోలేక కారు కిందే పడి నలిగిపోయారు.. హుటాహుటిన అక్కడికి వచ్చిన జీహెచ్‌ఎంసీ రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని సమీపంలోనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బయో డైవర్శిటీ వద్ద విషాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదంతో బయో డైవర్శిటీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ప్రమాదంలో చనిపోయిన మహిళ సత్యవేణిగా గుర్తించారు. గాయపడ్డవారిలో సత్యవేణి కూతురు కూడా ఉంది. ప్రమాదం దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో సీసీ ఫుటజ్‌ను చూస్తే తెలుస్తోంది. వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెండో ప్రమాదం. ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఘటనా స్థలాన్ని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పరిశీలించారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన నెలరోజుల్లోనే రెండు ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఇదే ప్లైఓవర్‌పై నిలబడి ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు.. వారిని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కిడక్కడే చనిపోయారు. ఈ ఫ్లైఓవర్‌పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు.

Similar News