నెలరోజుల ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ చరిత్రకు నాంది పడింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహారాష్ట్ర వికాస్ అఘాడిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-ఎన్సీపీ అంగీకారం తెలిపాయి. శనివారం మూడు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన చేయనున్నారు.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు , ఉమ్మడి ప్రణాళిక తదితర అంశాలన్నింటిపైనా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.. కాంగ్రెస్, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. ముంబైలో సమావేశమైన మూడు పార్టీల ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. శనివారం తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు.. తాజా పరిణామాలతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
రెండు రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు శుక్రవారం మళ్లీ ముంబయికి మారాయి. 3 పార్టీల నేతలు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ముంబయిలోని మాతోశ్రీలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఉద్దవ్ ఠాక్రే. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు... ముంబయి విడిచివెళ్లొద్దని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అటు ఈ సమావేశంలో మెజార్టీ సభ్యులు సీఎంగా ఉద్దవ్ ఠాక్రే, లేదా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేనే ఉండాలని అభిప్రాయపడ్డారు. అటు కాంగ్రెస్-ఎన్సీపీ ఎమ్మెల్యేలు నారిమన్ పాయింట్‌లోని ఓ రిసార్టులో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, పదవుల పంపకం, ఉమ్మడి ప్రణాళికలపై చర్చించారు. తర్వాత 3 పార్టీల నేతలు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు.. ఈ భేటీలోనే అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది..
బీజేపీ-శివసేన మధ్య విబేధాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంలో పడింది..దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి నుంచి మాహారాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి.. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీలు తలోమాట చెప్పాయి. సీఎం పదవి చుట్టూ రాజకీయాలు నడిచాయి. మాటల తూటాలు పేలాయి. మొదట శివసేనతో కలిచేందుకు కాంగ్రెస్ ససేమిరా అంది. దీంతో చర్చల ప్రక్రియకు మధ్యలో బ్రేక్ పడింది. గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్,ఎన్సీపీకి చెందిన ముఖ్య నేతలు ముంబయిలో వాలిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా పావులు కదిపారు.స్పాట్..
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కట్టడాన్ని పచ్చి అవకాశవాదంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ . ఆ సర్కారు ఆరు నుంచి 8 నెలలకు మించి ఉండబోదంటూ జోస్యం చెప్పారు. కేవలం బీజేపీని అధికారానికి దూరం చేయాలన్న లక్ష్యంతోనే అంతా జట్టుకట్టారని ఆరోపించారు గడ్కరీ. క్రికెట్, రాజకీయాల్లో ఎప్పుడైనా..ఏదైనా సాధ్యమేనన్నారు గడ్కరీ..
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిగా పోటీ చేశాయి. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీ- 54, కాంగ్రెస్కు-44 సీట్లు వచ్చాయి..అయితే ఫలితాల తర్వాత బీజేపీ-శివసేన మధ్య చెడింది. 50:50 ఫార్ములా కోసం పట్టుబడింది శివసేన. ససేమిరా అంది బీజేపీ. దీంతో మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. తాజాగా సేన,ఎన్సీపీ,కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకాబోతోంది.