పెట్రోల్ బాటిల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఓ రైతు

Update: 2019-11-25 11:22 GMT

ఓ రైతు పెట్రోల్ బాటిల్‌తో ఎమ్మార్వో ఆఫీసుకు రావడం గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపింది. పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయడంలో అలసత్వం వహిస్తున్నారంటూ.. పెట్రోల్ బాటిల్‌తో స్పందన కార్యక్రమానికి వచ్చాడు చినకాకానికి చెందిన రైతు గండికోట శివ కోటేశ్వరరావు. పెట్రోల్ బాటిల్‌ చూసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. 70 వేల రూపాయలు లంచం ఇచ్చిన రైతుకు పాస్ పుస్తకాలు ఇచ్చారని.. తాను డబ్బులు ఇవ్వడం లేదని అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నాడు రైతు శివ కోటేశ్వరరావు.

అయితే ఎమ్మార్వో వాదన మాత్రం మరోలా ఉంది. రైతుకు ఉన్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే సాగు భూమని.. మిగతాది సాగుకు పనికిరాదని చెబుతున్నాడు. ఇటీవల రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ రైతు ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి తహసీల్దార్ ఆఫీసుల్లో పలు ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. రైతులు పెట్రోల్‌ బాటిళ్లతో రావడం కలకలం రేపుతోంది. ఇటీవల కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో ఓ రైతు MRO ఆఫీస్‌కి వెళ్లి అక్కడ సిబ్బంది, కంప్యూటర్లు, ఫైళ్లపైనా పెట్రోల్ చల్లాడు.

Similar News