గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ప్లైఓవర్ ప్రమాదంపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. డిజైన్ లోపాల వల్లే ప్రమాదం జరిగిందన్న విమర్శలు రావడంతో.. నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నవంబర్ 4న ఈ ఫ్లైఓవర్ ప్రారంభం అయింది. 20 రోజులు కూడా కాకముందే పలు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం, ప్లానింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రోడ్ సేఫ్టీ నిపుణులు డిజైనింగ్‌లో లోపాలున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలంటూ నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు మంత్రి కేటీఆర్. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌తో పాటు లీ అసోసియేట్స్ ప్రైవేట్ సంస్థతో ఈ కమిటీని నియమించారు. ఫ్లైఓవర్ డిజైన్, ప్రమాద నివారణ చర్యలపై 3 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. SRDP, టౌన్ ప్లానింగ్, గ్రీన్ యాక్షన్ ప్లాన్, హెల్త్ అండి సానిటేషన్ పై సమీక్ష నిర్వహించారు.
కమిటీ సభ్యులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అటు అవసరమైతే మరో వారం నుంచి పదిరోజులు ఫ్లైఓవర్‌ను మూసివేస్తామన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నిర్మాణం దృఢంగా, మన్నికగా ఉంది. కానీ డిజైనే తీసికట్టుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. S ఆకారంలో రెండు మార్గాలున్నాయి. ఇది చాలా డేంజర్. ఫ్లైఓవర్ ఎక్కగానే ఒక్కసారిగా వేగం పెంచుతున్న వాహనదారులు.. మలుపు వచ్చేసరికి దాన్ని అదుపు చేయలేకపోతున్నారు. టర్న్ వద్ద రక్షణ గోడ ఎత్తు పెంచడంతో పాటు.. స్పీడ్ తగ్గించుకోవాలనే హెచ్చరిక బోర్డులు.. దూరం నుంచే కనిపించేలా ఏర్పాట్లు చేయాలంటున్నారు.
TS-09 C.W.5659 నెంబరు గల కారు శనివారం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పల్టీ కొట్టింది. అదే వేగంతో బలంగా చెట్టును తాకింది. ప్రమాదంలో బస్సుకోసం ఎదురు చూస్తున్న మణికొండకు చెందిన సత్యవేణి అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. కారు నడిపిన వ్యక్తితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు.