మహారాజకీయంలో ఆసక్తికర మలుపు

Update: 2019-11-25 03:05 GMT

మహారాష్ట్ర రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. సోమవారం కోర్టులో రాజ్‌ భవన్‌ ఇచ్చే లేఖలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మద్దతు లేఖలు చూసిన తర్వాతే బలపరీక్షపై నిర్ణయం చెబుతామని కోర్టు చెప్పడంతో తీర్పు ఎలా ఉంటుందన్న టెన్షన్‌ పార్టీల్లో పెరుగుతోంది. సుప్రీంకోర్టులో 10.30కు కేసు విచారణ మొదలవుతుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలతో సిద్దమవుతున్నాయి. ఎవరికి వారు ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని కోర్టులో వాదించేందుకు సిద్దమవుతున్నాయి.

అటు న్యాయపోరాటం చేస్తూనే.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై పార్టీలు దృష్టిసారించాయి. ఎమ్మెల్యేలకు ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా జాగ్రత్త పడుతున్నాయి పార్టీలు. ముంబైలోని లలిత్ హోటల్‌ లో శివసేన ఎమ్మెల్యేల క్యాంపు ఉండగా.. రాత్రి మరో రహస్య ప్రాంతానికి మార్చారు. పొవోయ్‌లోని రెనాసెన్స్ హోటల్‌లో ఎన్సీపీ ఎమ్మెల్యేలను కూడా హయత్ హోటల్ కు మార్చారు. ఇక జుహూ ఏరియాలోని JW మారియట్ హోటల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ వేశారు. ఆయా హోటళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

మహారాష్ట్రలో తాజారాజకీయ సంక్షోభం మరాఠా యోధుడు శరద్‌ పవార్‌ కు సవాలుగా మారింది. బీజేపీని గద్దె దించడంతో పాటు.. కుటుంబంలో పార్టీలో తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడటం ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. అజిత్‌ పవార్‌ వైపు ఎమ్మెల్యేలు వెళ్లకుండా నిమిషం కూడా ఖాళీ లేకుండా విసృతంగా మంతనాలు జరుపుతున్నారు. అటు కాంగ్రెస్, శివసేన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సోమవారం ఉదయం 5గంటలకే ఆయన ఇంటి నుంచి ఎమ్మెల్యేలున్న హోటల్‌‌కు చేరుకున్నారు.

అటు కాంగ్రెస్‌ కూడా పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తపడుతోంది. అశోక్‌ చవాన్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు క్యాంపు రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఇతర పార్టీలతో టచ్‌ లో లేరని.. అంతా తమ క్యాంపులోనే ఉన్నారని అంటున్నారు. బీజేపీ మైండ్‌ గేమ్‌ ఆడుతుందన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి 25మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా మారి.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తారన్న వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి. హస్తం నేతలు మాత్రం అలాంటిదేమీ లేదంటోంది.

అటు శివసేనను చీలిక భయం వెంటాడుతోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మొదటినుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కోరుతున్నారు. కానీ ఉద్దావ్ ఈ విషయంలో వారి మాటను పెడచెవిన పెట్టారు. శివసేనలో బీజేపీ అనుకూల వర్గం కమలనాథులకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే శివసేన మాత్రం అలాంటిదేమీ లేదని.. ఎమ్మెల్యేలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు.

అటు కమలనాథులు బలనిరూపణపై దృష్టిసారించారు. తమ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించిన బీజేపీ.. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నాయకులతో టచ్ లోకి వెళుతోంది. తమకు మద్దతు ఇస్తే మంత్రిపదవులు ఇస్తామంటూ అజిత్ పవార్ బేరసారాలు మొదలుపెట్టారు. అయితే శరద్ పవార్ ను కాదని.. ఎంతమంది అజిత్ వెంట వెళతారన్నది స్పష్టత రావాల్సి ఉంది. అటు శరద్ పవార్ కానీ.. ఇటు అజిత్ కానీ తమకు ఎంతమంది మద్దతు ఇస్తున్నారన్నది స్పష్టత ఇవ్వడం లేదు. ఎవరికి క్యాంపులో ఎంతమంది ఉన్నారన్నది బయటకు చెప్పడం లేదు.

Similar News