మహారాష్ట్ర సంక్షోభం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Update: 2019-11-25 07:54 GMT

మహారాష్ట్ర సంక్షోభంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్‌ వద్ద కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్‌భవన్‌ మెజారిటీని నిరూపించజాలదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపులు నిరోధించాలంటే వెంటనే బలపరీక్ష జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది.

ఎన్నికలకు ముందు మిత్రపక్షంగా ఉండి కలిసి పోటీ చేసిన శివసేన.. ఎన్నికల ఫలితాల తర్వాత చివరి నిమిషంలో ప్లేట్‌ ఫిరాయించిందని బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. శివసేన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శివసేన తీరుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, అనంతర పరిణామాల్లో ఒక పవార్‌ బీజేపీతో ఉండగా.. మరొక పవార్‌ శివసేనతో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న శివసేన కూటమే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖలపై గవర్నర్‌ను అనుమానించాల్సిన అవసరం లేదని, దేవేంద్ర ఫడ్నవిస్‌, అజిత్‌ పవార్‌ కలిసి సమావేశమైన తర్వాతే గవర్నర్‌కు లేఖ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారని చెప్పారు. అటు ప్రభుత్వం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. గవర్నర్‌ ఎక్కడా నిబంధనలకు విరుద్దంగా వ్యవహిరించలేదని.. రాజ్యాంగంబద్దంగానే లేఖ అందిన తర్వాత ఫడ్నవిస్‌ ను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించారన్నారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని.. ఫడ్నవిస్‌కు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా? అంటూ ప్రశ్నించింది. దీంతో అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీ సిద్ధంగానే ఉందని రోహిత్గీ కోర్టుకు తెలిపారు. ఫడ్నవిస్‌ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందన్నారు. ఈ విషయంలో గవర్నర్‌ విచక్షణతోనే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎప్పటిలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలో సుప్రీంకోర్టు చెప్పజాలదని రోహత్గి వాదించారు. ఎన్సీపీ రెబల్‌ నేత అజిత్‌ పవార్‌ తరఫు లాయర్‌ మణిందర్‌ సింగ్‌ కూడా తమదే అసలైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఎన్సీఎల్పీ నాయకుడిగా తమ పార్టీకి చెందిన 54మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు ఇచ్చినట్టు తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు లేఖ ఇచ్చానని సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పార్టీలోనే పరిష్కరించుకుంటామని, వెంటనే ఈ పిటిషన్‌పై విచారణ నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

అయితే తుషార్ మెహతా వాదనతో కాంగ్రెస్ న్యాయవాదులు విభేధించారు. అది కేవలం ఎల్పీ నేతగా అజిత్ పవార్ ను ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని.. బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దురుద్దేశం ఉంది కాబట్టే.. అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసి.. హడావిడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని అర్ధరాత్రి హత్య చేశారని న్యాయవాది సింఘ్వీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమికి 155 మంది మద్దతు ఉందని కోర్టుకు అఫడవిట్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ జరగకుండా ఉండాలంటే ఈరోజే బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్ తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

 

Similar News