టెన్షన్..టెన్షన్ 'మహా'రాజకీయం

Update: 2019-11-26 03:51 GMT

మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. మంగళవారం కోర్టులో ఇచ్చే తీర్పు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. సోమవారం వాదనలు విన్న ధర్మాసనం బలపరీక్షపై కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. బలపరీక్షకు ఎప్పుడు ఆదేశిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. గడువు ఇవ్వకుండా వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని సేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి ధర్మాసనాన్ని కోరాయి. నాలుగు రోజులు గడువు కావాలని బీజేపీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. అన్ని పార్టీలు కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి.

అటు 162మంది ఎమ్మెల్యేలతో శివసేన - ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలు బలప్రదర్శనకు దిగాయి. హోటల్ లో సమావేశం అయిన మూడుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు.. బీజేపీ ప్రలోభాలకు లొంగబోమని ప్రతిజ్ఞ చేశారు. స్వతంత్రులతో పాటు.. మొత్తం 162మంది తమతోనే ఉంటే.. బీజేపీ బలం ఎలా నిరూపించుకుంటుందని ఎన్సీపీ ప్రశ్నించింది. అజిత్ పవార్ మినహా బీజేపీకి ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదన్నారు.

మహారాష్ట్రలో అధికారం కాపాడుకునేందుకు జాతీయ నాయకత్వం రంగంలో దిగినట్టు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా బలపరీక్షలో నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. తమకు పూర్తిమెజార్టీ ఉందని... 175 మంది సభ్యుల మద్దతు ఉందని చెబుతోంది. కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలతో కమలనాథులు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. బలపరీక్షకు కోర్టు ద్వారా రెండుమూడు రోజుల గుడువు లబిస్తే .. పరిస్తితులను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చని భావిస్తున్నారు. అయితే శరద్ పవార్ పట్టుదలగా ఉండడంతో బీజేపీ వైపు ఎవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది. అజిత్ పవార్ ను నమ్ముకున్నా.. ఆయన ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. దీంతో సేన, కాంగ్రెస్ వైపు చూస్తోంది బీజేపీ. మరి ఫిరాయింపులతో రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? మరాఠా యోధుడు శరద్ పవార్ తన శక్తియుక్తులను మరోసారి చాటుకుని.. అమిత్ షా, ఫడ్నవిస్ కు షాకిస్తారా? చూడాలి.

Similar News