మహారాష్ట్ర కేసులో త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. బుధవారం సాయంత్రంలోగా బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించారు. తక్షణమే ప్రోటెం స్పీకర్ ను నియమించి బుధవారం ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించారు. ఫడ్నవిస్ ప్రభుత్వానికి గవర్నర్ 30వరకూ గడువు ఇచ్చినా.. కోర్టు మాత్రం మూడురోజుల ముందుగానే ఫ్లోర్ టెస్ట్ జరపాలని ఆదేశించింది.
తీర్పు సందర్భంగా ధర్మాసనం పలుకీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇదే తరహా కేసుల్లో తీర్పులను ఉటంకించింది. ఎస్.ఆర్.బొమ్మై, కర్నాటక కేసులను ప్రస్తావించిన ధర్మాసనం.. రాజ్యాంగ విలువలు కాపాడాలంటే సాధ్యమైనంత త్వరగా బలపరీక్ష జరగాలని అభిప్రాయపడింది.
అటు బలపరీక్ష సందర్భంగా పలు మార్గదర్శకాలు కూడా సుప్రీం సూచించింది. సీక్రెట్ బ్యాలెట్ అవసరం లేదని.. అలాగే లైవ్ కవరేజి ఇవ్వాలని తెలిపింది. 5గంటల్లోగా సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తిచేసి.. ఈ తర్వాత ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని సూచించింది.
అటు సుప్రీంతీర్పును కాంగ్రెస్- ఎన్సీపీ-శివసేన స్వాగతించాయి. ఇది చారిత్రక తీర్పు అని.. సోనియాగాంధీ అన్నారు. ఫ్లోర్ టెస్టుకు సిద్దంగా ఉన్నామని.. విజయం తమదేనన్నారు. కోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమని శివసేన అభిప్రాయపడింది. ఫ్లోర్ టెస్ట్ జరిగితే విజయం తమదేనని ఎన్సీపీ స్పష్టం చేసింది. స్పష్టమైన మెజార్టీ తమకు ఉందని... ఫడ్నవిస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు.