జిల్లాల వారిగా సమీక్షలతో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీ అయ్యారు. పార్టీని పటిష్ట పరచడంతో పాటు.. వైసీపీ దాడులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో కెడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. కడపలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు మొదట వైసీపీ బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే దాడులు జరుగుతుంటే స్పంధించకపోవడం దారుణమన్నారు చంద్రబాబు. అక్రమ కేసులు నమోదైనవారిపై కోర్టుకు అయ్యే ఖర్చులను పార్టీయే భరిస్తుందని భరోసా ఇచ్చారు.
కడప జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెద్ద ఎత్తు దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలపై దాడులు చేయడమే... వైసీపీ చెప్పిన సుపరిపాలనా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాలనపూర్తిగా పడకేసిందని.. అరాచకం, అబద్దాలు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతో్ందని.. ఇష్టారాజ్యంగా జీవోలు ఇస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. మంత్రులు బాధ్యత మరిచి.. బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
పార్టీ నాయకుల్లో.. కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేసిన చంద్రబాబు.. జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంగా పోల్చుతూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధకలిగించాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ గతంతోపాటు, భవిష్యత్తునూ చెరిపివేస్తూ భవిష్యత్ తరాలకు ఏమీ మిగల్చడంలేదని ఆక్షేపించారు. రాజధాని నగరాన్ని గౌరవించలేకపోతే కనీసం భూములు ఇచ్చిన రైతుల మనోభావాలనైనా గౌరవించాలని ఆయన హితవుపలికారు.