మహారాష్ట్రలో అధికారం కోసం జరిగిన ఎత్తులు, పై ఎత్తుల్లో ఎన్సీపీ నేతలు విజయం సాధించారు. శరద్ పవార్ మరోసారి తనదైన రాజకీయ చతురత ప్రదర్శించి బీజేపీ నుంచి తమ కూటిమికి అధికారం దక్కేలా చేశారు. దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న గుజరాత్ జోడీ అమిత్ షా, మోదీను ఢీకొట్టి.. మరాఠా గడ్డలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అయితే ఈ రాజకీయ యుద్దంలో శరద్ పవార్ తో పాటు.. ఆయన తనయ ఎంపీ సుప్రియసూలే సైతం పాలుపంచుకున్నారు. తనదైన పాత్ర పోషించారు. పార్టీకి అండగా.. బాబాయ్ కు అండగా ఇంత కాలం ఉన్న అన్న అజిత్ పవార్ రాత్రికి రాత్రి ఫ్లేటు ఫిరాయించడంతో శరద్ పవార్ ఒంటరయ్యారు. సరిగ్గా ఆ సమయంలో సుప్రియా అన్నీ తానై తండ్రికి చేదోడువాదోడుగా నిలిచారు. తండ్రి వ్యూహాలను అమలు చేశారు.
తండ్రిచాటు బిడ్డగా, అన్నచాటు చెల్లిగా ఉంటూ కేవలం ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుప్రియా సూలే తాజా పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లోనూ రాటుదేలారు. ఫడ్నవిస్ ప్రమాణస్వీకారోత్సవం నుంచి నేటి అసెంబ్లీ సమావేశాల వరకూ అందరి తల్లో నాలుకగా వ్యవహరించారు. యువజన విభాగాన్ని ప్రోత్సహించి.. ఈ సంక్షోభంలో పాలుపంచుకునేలా చేశారు. యువనాయకులు ఎమ్మెల్యేలకు ఎస్కార్టుగా ఉండి.. హోటల్ వద్ద భద్రతను కాపాడేలా చేశారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా పార్టీలోని యువతను అప్రమత్తం చేశారు. వారితో నిఘా పెట్టించారు. ఇలా సంక్షోభంలో సుప్రియా సూలే.. తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు. బుధవారం కూడా ఉదయమే అసెంబ్లీకి చేరుకుని ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. పెద్దవాళ్ల కాళ్లకు నమస్కారం.. చిన్నవాళ్లలో ధైర్యం నింపుతూ ఆకట్టుకున్నారు సుప్రియా.