మరో ఆన్ లైన్ మోసం.. ఓఎల్ ఎక్స్ లో తక్కువ ధరకే కారు వస్తుందని.. చివరకు..

Update: 2019-11-28 11:51 GMT

చిత్తూరు జిల్లాలో ఆన్ లైన్ మోసం ఒకటి వెలుగుచూసింది. ఓఎల్ ఎక్స్ లో తక్కువ ధరకే కారు అమ్ముతామంటూ హార్యానా గ్యాంగ్... చిత్తూరుకు చెందిన షాజిద్ అనే డ్రైవర్ ను మోసంచేసింది. పలమనేరులోని రంగాపురం వీధికి చెందిన షాజిద్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆన్ లైన్ లో స్విఫ్ట్ డిజైర్ కారు నచ్చి భేరమాడాడు. మంచి కారు.. తక్కువకే వస్తుందని భావించాడు. ట్రాన్స్ పోర్టు ఖర్చులకంటూ షాజిత్ నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుని మోసం చేశారు కొందరు వ్యక్తులు. ఆలస్యంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాజిద్.

ఆన్ లైన్ లో కారు చూసి అందులో ఉన్న నెంబర్ కు ఫోన్ చేయగా.. తాను ఆర్మీ అధికారి అని... కుటుంబ అవసరాల కోసం తక్కువ ధరకే అమ్ముతున్నట్టు తెలిపాడు జైకిషన్ అనే వ్యక్తి. 2017 మోడల్ కారు కేవలం లక్ష 10వేలకే ఇస్తున్నట్టు చెప్పాడు. అయితే ఆర్మీ క్యాంపులో కారు ఉందని.. మిలటరీ వాహనాలు రవాణా చేసే సంస్థ ద్వారా పంపిస్తానని నమ్మబలికాడు. ట్రాన్స్ పోర్టు ఖర్చులకు 2వేలు తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించాడు కిషన్. వెంటనే జీ పే ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు షాజిద్. మరుసటి రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి... తిరుపతి వరకూ కారు తీసుకొచ్చామని.. ఇక్కడ జీపీఎస్ పాడైందని... అమర్చుకుని రావాలంటే 17వేల వరకూ ఖర్చు అవుతుందని... అర్జెంట్ గా ట్రాన్స్ ఫర్ చేయాలన్నాడు. అనుమానం వచ్చిన షాజిద్.. కారు అమ్మిన వ్యక్తి జైకిషన్ కు ఫోన్ చేశాడు. అతను కూడా కారు పంపించినట్టు... నిజమే అని నమ్మించాడు. దీంతో షాజిత్ ముందూ వెనకా ఆలోచించకుండా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు. మళ్లీ మరుసటి రోజు జైకిషన్ ఫోన్ చేసి అర్జెంట్ గా 10వేలు ట్రాన్స్ ఫర్ చేయాలన్నాడు. షాజిద్ అదే ఫోన్ నెంబర్ కు మళ్లీ ట్రాన్స్ ఫర్ చేశాడు. వారం గడిచినా కారు రాలేదు. తర్వాత ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తోంది. దీంతో మోసపోయినట్టు ఆలస్యంగా గుర్తించాడు షాజిద్.

కిషన్ అనే వ్యక్తి తనను మోసం చేసినట్టు గుర్తించిన షాజిద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు. షాజిత్ తో మాట్లాడిన ఫోన్ నెంబర్ పై నిఘా పెట్టగా.. ఇది హరియాణా సైబర్ గ్యాంగ్ ముఠా పని అని తేల్చారు. గతంలోనూ ఈ ముఠా ఇదే తరహా మోసాలకు పాల్పడినట్టు పలుచోట్ల కేసులు కూడా ఉన్నాయి. ఆన్ లైన్ మోసాలు పెరిగాయని.. ప్రజలు అప్రమత్తంగా పోలీసులు సూచిస్తున్నారు. తరచుగా ఈ తరహా కేసులు వెలుగుచూస్తున్నా కొందరు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.

Similar News