ఉద్రిక్తతకు దారి తీసిన చంద్రబాబు అమరావతి పర్యటన

Update: 2019-11-28 06:48 GMT

ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని పర్యటనకు వస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను ఓ వర్గానికి చెందిన రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమరావతిలో పర్యటించవద్దంటూ ఫ్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి తోడు వైసీపీ కార్యకర్తలు కూడా చేరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

సీడ్ యాక్సిస్ రహదారిలో చంద్రబాబు కాన్వాయ్‌పైకి వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసిరారు. చంద్రబాబు వెళ్తున్న బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీ నిరసనలను అడ్డుకుంటూ చంద్రబాబుకు స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు, రాజధాని రైతులు. వెంకటపాలెం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు పార్టీలకు చెందిన ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అతి కష్టం మీద చంద్రబాబు కాన్వాయ్‌కు రూట్‌ క్లియర్‌ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం రైతులు.. తమకు క్షమాపణ చెప్పిన తరువాతే రాజధానిలో అడుగు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామ కంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నిస్తున్నారు.

అటు వైసీపీ ఆందోళనకు దిగుతుందని తెలిసినా.. ముందుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని.. ఎవరు అడ్డొచ్చినా రాజధానిలో చంద్రబాబు పర్యటన ఆగదన్నారు టీడీపీ నేతలు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై మరో వర్గానికి చెందిన రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఆందోళనలో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకు వస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Similar News