దాదాపు నెల రోజులకు పైగా జరిగిన చర్చోపచర్చలు ఫలించి ఎట్టకేలకు సీఎం కుర్చీని శివసేన దక్కించుకుంది. వచ్చిన వెంటనే వరాల జల్లు కురిపిస్తోంది. ఈ సంకీర్ణ సర్కారు పేద ప్రజలకు రూపాయికే వైద్యం.. పదిరూపాయలకే భోజనం పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు స్థానికులకే ఇప్పిస్తామని శివసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు నడుం బిగించింది. రాష్ట్ర ప్రజలందరికి వైద్యబీమా కల్పిస్తామని సంకీర్ణ పార్టీల నేతలు వెల్లడించారు. బలహీన వర్గాల మహిళలకు ఉచితంగా విద్యను అందిస్తామని అంటున్నారు. మురికి వాడల పునరావాస కార్యక్రమం కింద పేదలు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని సర్కార్ యోచిస్తోంది. 15 ఏళ్లనుంచి మహారాష్ట్రలో నివాసం ఉంటున్న వారిని స్థానికులుగా గుర్తించి వారికే 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు రిజర్వు చేస్తామని ప్రకటించారు. రైతులు తీసుకున్న రుణాల మాఫీపై కొత్త కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.