పోలీసులకు సవాల్‌గా మారిన మరో కేసు

Update: 2019-11-30 02:56 GMT

వరుస హత్యలతో శంషాబాద్ వణికిపోతోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రియాంక హత్య ఘటన తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే మరో మహిళ సజీవదహనం అయ్యింది. అత్యాచారానికి ఒడిగట్టి హత్యచేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే..పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేగాని మహిళ మృతి కారణాలపై క్లారిటీ ఇవ్వలేమని అంటున్నారు పోలీసులు. ప్రియాంక కేసును చేధించన రోజునే మరో మహిళ అనుమానస్పద మృతి సైబరాబాద్ పోలీసులకు సవాల్ గా మారింది.

హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రియాంకరెడ్డి ఘటన తరహాలోనే మరో మహిళ అనుమానస్పద స్థితిలో సజీవదహనమైంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడిందని అనుకునేలోపే పోలీసులకు మరో సవాల్. ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. రాళగూడ నుంచి సిద్ధులగుట్టకు వెళ్లే దారిలో ఓ మహిళ అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. బంగారు మైసమ్మ ఆలయం పక్కన మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు. గుడి పక్కన కాలిపోతున్న మహిళను గమనించి వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయింది. మృతురాలు దాదాపు 32-35 ఏళ్ల మహిళగా భావిస్తున్నారు. ప్రియాంక తరహాలోనే క్రైమ్ సీన్ ఉండటంతో అత్యాచారానికి తెగబడి హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు హుటాహుటిన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తేగాని స్పష్టత ఇవ్వలేమంటున్నారు పోలీసులు.

దాదాపు 46 గంటల వ్యవధిలో జరిగిన రెండు హత్యలు శంషాబాద్ పరిసరాల్లో కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య జరిగింది. ఆమె కేసు కొలిక్కి వచ్చిన గంటల వ్యవధిలోనే సిద్ధులగుట్ట ప్రాంతంలో మరో మహిళ సజీవదహనమైంది. శుక్రవారం సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

సిద్ధులగుట్ట రోడ్డులో అనుమానస్పద స్థితిలో మృతిచెందిన మహిళది హత్యా? ఆత్మహత్యా? హత్య అయితే ఎవరు చేశారు? ఇంతకీ చనిపోయిన ఆ మహిళ ఎవరు? పోలీసులు ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

చనిపోయిన మహిళ ఎవరు అనేది స్పష్టత వస్తే విచారణ మరింత స్పీడు అందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే.. మహిళ ఆత్మహత్యకు పాల్పడితే సిద్ధులగుట్ట రోడ్డు పక్కనే ఎందుకు అఘాయిత్యానికి ఒడిగడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా సీన్ ఆఫ్ అఫెన్స్ లో మృతురాలు బట్టలు, చెప్పులు మాత్రమే లభించాయి. అగ్గిపెట్టేగానీ, పెట్రోల్ బాటిల్ గాని లేవు. పైగా మంటలకు తాళలేక అటు ఇటు కదిలిన దాఖలాలు కూడా లేవు. దీంతో ఆమెను ఎవరో హత్య చేసి ఆ తర్వాత నిప్పు అంటించి ఉంటారనే సందేహాలు ఉన్నాయి. స్పాట్ లో రక్తపు మరకలు ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది.

ఈ కేసులో విచారణలో పోలీసులకు అడుగడుగునా చిక్కు ప్రశ్నలే ఎదురవుతున్నాయి. శంషాబాద్ చుట్టపక్కల పోలీస్ స్టేషన్లలో ఇటీవలి కాలంలో మిస్సింగ్ కేసులు లేవు. కొత్తగా ఫిర్యాదులు కూడా రాలేదు. దీంతో ఆమె ఎవరనేది కనుక్కోవాల్సి ఉంది. కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే.. 46 గంటల వ్యవధిలో రెండు హత్యలు జరగటం శంషాబాద్ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఘటన జరిగిన ప్రాంతంలోని చుట్టుపక్కల సీసీఫూటేజీలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. వీలైనంత త్వరగా మిస్టరీ చేధిస్తామని అంటున్నారు.

Similar News