ప్రారంభమైన ఝార్ఖండ్ తొలి దశ ఎన్నికలు

Update: 2019-11-30 01:35 GMT

 

జార్ఖండ్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా శనివారం ఆరు జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఇందుకోసం సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. దాదాపు 38 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. తొలిదశ ఎన్నికలకు 189 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రమంత్రి తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. 3 వేల 906 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎన్నికల అధికారులు.

జార్ఖండ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. దీంతో మరోసారి గెలవాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తొలిదశలో బీజేపీ 12 చోట్ల పోటీ చేస్తుండగా.. ఒక చోట బరిలో నిలబడకుండా స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. ఇక బీజేపీకి పోటీగా కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆర్జేడీ మహా కూటమిగా ఏర్పడ్డాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

2000లో ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్‌ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాతా ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు. నక్సల్స్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌తో కలసి పోటీ చేసిన బీజేపీ 43 స్థానాల్లో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి 2020 జనవరి 5తో ముగియనుంది.

Similar News