ఏపీ సీఎం జగన్ తీరుపై మరోసారి ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్. ఆరు నెలల్లో తమపై చేసిన ఒక్క అవినీతి ఆరోపణనైనా నిరూపించగలిగారా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. తన చేతకాని పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబుపై బురదజల్లబోయి చేతులు కాల్చుకున్న తరువాత కూడా జగన్ బుద్ధిలో మార్పు రాలేదని విమర్శించారు. పీపీఏల దగ్గర నుండి అమరావతి వరకు జగన్ లేవనెత్తిన ప్రతి అంశం జాతీయ స్థాయిలో షాక్ కొట్టించిందన్నారు. అయినా ఇప్పుడు పోలవరంలో అవినీతి అనబోయి.. పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. పోలవరంలో అవినీతి అంటూ అరిచిన వాళ్లకు కేంద్ర మంత్రి సమాధానం చెంపపెట్టు అన్నారు లోకేష్. పోలవరం నిర్మాణంలో అన్నీ నిబంధనల మేరకే జరిగాయని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంతోనైనా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలి అన్నారు లోకేష్.