మన దేశంలో చట్టాలు ఉన్నవాడి చుట్టాలు. జరిగిన దారుణం కళ్లకు కడుతున్నా.. దోషులను పట్టుకున్నా.. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ సంవత్సరాల తరబడి సాగదీస్తుంటారు. ఒక వేళ జరిగిన దారుణం అత్యంత అమానవీయమైనదని గొంతు చించుకుంటే కోర్టులు కదులుతాయి.. శిక్షలు అమలు చేస్తాయి. ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెబుతాయి. అప్పుడే ఉరి వేసే తలారితో పని.. ఎప్పుడో అమావస్యకో, పౌర్ణమికో ఆపని జరుగుతుంది. అంతవరకు తలారితో పని లేదు. అందుకే పర్మినెంట్ తలారిలు ఉండరు. దోషులకు ఉరిశిక్ష వేయాలంటే అప్పటికప్పుడు తలారి కావాలంటూ ప్రకటన ఇస్తారు.
ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతం కేసులో 6గురు నిందితులను అరెస్టు చేసి జైల్లో పెట్టి మేపుతున్నారు. వారికి ఉరి శిక్ష ఖరారైనా ఇప్పటి వరకు శిక్ష పడలేదు. ఉరి వేసేందుకు తలారి లేకపోవడమే అందుకు కారణం. దీంతో తలారిని వెతికే పనిలో పడ్డారు జైలు అధికారులు. ఈ విషయం తెలిసి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాష్ట్రపతికి లేఖరాశారు. దుర్మార్గులను శిక్షించడానికి ఎవరూ లేకపోతే వాళ్లను ఉరి తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.