ఆస్తి కోసం కన్నకొడుకే కాలయముడయ్యాడు. భూమిని తనపేరును రాయనందుకు తండ్రినే గొడ్డలితో నరికి హత్య చేశాడు ఓ సుపుత్రుడు. మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామంలో జరిగింది.
పుదరి చంద్రయ్య తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భూమిలో తనకు వాటా ఇవ్వాలని కొడుకు పుదరి మహేష్ తరుచుగా తండ్రితో గొడవపడుతుండేవాడు. ఆస్తి పంచకపోతే చంపేస్తానని కూడా బెదిరించేవాడు. చివరికి అన్నంత పనిచేశాడు. ఆస్తి ఇవ్వనందుకు కక్ష పెంచుకుని... తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేష్ కోసం గాలిస్తున్నారు.