ఉప్పల్ వేదికగా జరగబోయే టీ20 తొలి మ్యాచ్ కోసం సన్నద్దమవుతున్న భారత్, వెస్టిండీస్ జట్లు

Update: 2019-12-05 07:58 GMT

3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే తొలి T 20 కోసం భారత్, వెస్టిండీస్ జట్లు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాయి. టీమిండియా బలాలు చూసుకుంటే.. షార్ట్‌ క్రికెట్‌ ఫార్మాట్‌లో విరాట్ సేన ప్రధానాయుధం బ్యాటింగే. టాపార్డర్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. శిఖర్ ధావన్ గాయంతో జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో లోకేశ్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే తమదైన ముద్ర వేసేందుకు తహతహలాడుతుంటే.. సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కితే చెలరేగిపోవాలని చూస్తున్నాడు. గత సిరీస్‌లో అరంగేట్రం చేసిన హార్డ్ హిట్టర్ శివం దూబే ఈసారైనా మెరుపులు మెరిపించాలని భావిస్తున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో చాలాకాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో మహమ్మద్ షమీ ఆడనున్నాడు. పేపర్‌పైన బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నా.. సీనియర్లు విఫలమైతే మిడిలార్డర్‌లో జట్టును ముందుకు నడిపించే ఆటగాళ్లు కరువయ్యారు.

T 20 ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టుపై ఓ అంచనాకు రావడం కష్టమే. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని విండీస్ ఇటీవల తమకంటే ఎంతో బలహీనమైన ఆఫ్ఘన్ జట్టు చేతిలో సిరీస్ కోల్పోయింది. పెద్ద జట్లను సైతం అలవోకగా ఓడించేలా కనిపించే కరీబియన్లు.. మరుక్షణంలోనే చేతులెత్తేసి చిన్నజట్ల చేతిలోనూ చతికిలపడటం సాధారణం. అయితే అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలో దిగనుండటం కలసొస్తుందని ఆ జట్టు కెప్టెన్ పొలార్డ్ అంటున్నాడు.

తొలి టీ20 మ్యాచ్‌ కోసం భారత్‌-వెస్టిండీస్ జట్లు ఒక పక్క ముమ్మరంగా సాధన చేస్తుండగా మరో పక్క వరుణుడు ఎక్కడ అడ్డుపడతాడో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్‌ రోజున ఉదయం 6 నుంచి 11 గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. ఇక, ఉప్పల్‌లో 2017 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 వర్షంతో రద్దుకావడం గమనార్హం.

Similar News