ఢిల్లీలో కేంద్ర పెద్దలతో సీఎం జగన్‌ చర్చలు

Update: 2019-12-06 01:17 GMT

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన జగన్‌.. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరానికి రావాల్సిన నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన, అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని ఆహ్వానించనున్నారు సీఎం జగన్‌.

ఈనెల 23న స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుంది. అలాగే జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ రెండూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక కార్యక్రమాలే కావడంతో సీఎం జగన్‌ స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిన నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఈ కార్యక్రమాలకు మోదీ వస్తారని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను జగన్‌ కలవనున్నారు. ఆ తర్వాత రాత్రి ఢిల్లీ నుంచి తిరుగుపయనం అవుతారు.

ఢిల్లీ వెళ్లగానే వైసీపీ ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విభజన సమస్యలతోపాటు పెండింగ్ నిధులపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని కోరాలని ఎంపీలకు సూచించారు జగన్‌.

Similar News