నవంబర్ 27న దిశ హత్య జరిగింది. ఆ తర్వాతి రోజే నిందితులు నలుగురినీ పోలీసులు పట్టుకున్నారు. మరుసటి రోజు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేశారు. ఆ సందర్భంగా జనం పోలీస్‌స్టేషన్ ముందు కాపు కాశారు. ఆ నలుగురిని అప్పగిస్తే చంపేస్తామంటూ నినదించారు. వారిని కంట్రోల్ చేయడం ఖాకీల తరం కాలేదు. పోలీసులపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడదే జనం పూలవర్షం కురిపించారు. రాక్షస సంహారం చేశారంటూ పోలీసులకు స్వీట్లు తినిపించారు. సాహో సజ్జనార్ అంటూ చటాన్‌పల్లి దగ్గర నినాదాలు చేశారు.
పది రోజుల క్రితం... చటాన్‌పల్లి దగ్గర దిశను సజీవదహనం చేసినప్పుడు యావత్ భారతం కన్నీరు పెట్టింది. మదమెక్కిన మృగాళ్లను నడిరోడ్డుపై ఉరి తియ్యాలని డిమాండ్ చేసింది. నిత్యం క్యాండిల్ ర్యాలీలు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌన ప్రార్థన చేశారు. చట్టాల పేరుతో కాలయాపన చేయకుండా.. ఆ నలుగురు నిందితులను చంపేయాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. ఇవాళ దిశ నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. చటాన్‌పల్లి దగ్గర పుష్పాంజలి ఘటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరినట్టేనని అంటున్నారు.