జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై వరంగల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హన్మకొండలోని రెడ్‌క్రాస్‌లో తలసేమియా బాధితుల కోసం అదనపు బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి వేయిస్తంబాల ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత భద్రకాళి టెంపుల్‌కు చేరుకొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఖిలా వరంగల్‌లో సౌండ్స్ అండ్ లైట్ షో ద్వారా కాకతీయ రాజుల గొప్పతనాన్ని తెలుసుకున్నారు. గవర్నర్ తమిళిసై దంపతులు హన్మకొండలోని హరిత హోటల్‌లో బస చేశారు.
ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను గురించి గవర్నర్‌కు మంత్రి వివరించారు.
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లనున్న గవర్నర్ తమిళిసై.. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. తర్వాత ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. మూడోరోజు రామగుండంలోని ఎన్టీపీసీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల కళరియపట్టు మర్మకళ ప్రదర్శనను తిలకించనున్నారు గవర్నర్. ఆ తర్వాత పెద్దపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబల శానిటరీ న్యాప్కిన్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. చివరిగా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్ వద్దకు చేరుకుని పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు పయనం కానున్నారు గవర్నర్.