ఏపీ సర్కార్‌ సిగ్గుపడాల్సిన ఘటన.. ఉల్లి కోసం క్యూ లైన్‌లో నిల్చొని ఓ వ్యక్తి మృతి..

Update: 2019-12-09 06:59 GMT

ప్రజల ప్రభుత్వమనే చెప్పుకునే ఏపీ సర్కార్‌ సిగ్గుపడాల్సిన ఘటన ఇది. విత్తనాల కోసం, యూరియా కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రజలు మృతిచెందిన ఘటనలు చూశాం. ఇప్పుడు మరీ దారుణంగా.. ఉల్లి కోసం క్యూ లైన్‌లో నిల్చొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది.

గుడివాడ రైతు బజార్‌లో ఉల్లిపాయల కోసం ఉదయం నుంచే జనం బారులు తీరారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లికొనలేక.. సాంబయ్య అనే వృద్ధుడు కూడా.. క్యూ కట్టారు. అయితే... ఒత్తిడికి గురై అక్కడికక్కడే కుప్పకూలాడు సాంబయ్య. గుండెపోటుతోనే సాంబయ్య మృతి చెందాడని వైద్యులు గుర్తించారు. ఉల్లి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. వీటికితోడు ఉల్లి కూడా సాధారణ జనాలకు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం సబ్సిడీపై రైతు బజార్లలో జనాలకు అందిస్తోంది. అయితే... రాష్ట్రంలోని ఏ రైతు బజార్‌లో చూసినా చాంతాడంత క్యూలు భయపెడుతున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఇబ్బందిపెట్టే బదులు.. ఉల్లి ధరల్ని నియంత్రించ వచ్చు కదా అని.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లి ధరలు ఆకాశనంటడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలతో కలిసి... పాదయాత్రగా అసెంబ్లీ చేరుకున్నారు. ఉల్లిపాయ దండలను టీడీపీ నేతలు మెడలో వేసుకుని ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఉల్లి ధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో ఉల్లి ధరలతో, నిత్యవసర ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో నిత్యవసర ధరలు పెరగడకుండా చర్యలు తీసుకున్నామన్నారు చంద్రబాబు. ధరలు దిగి వచ్చేంత వరకూ మా పోరాటం ఆగదన్నారు చంద్రబాబు.

ఏపీలో నిత్యవసర ధరల పెరుగుదుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన చంద్రబాబును గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో అసెంబ్లీలోకి అనుమతి లేదని టీడీపీ నేతలంతో పాటు... చంద్రబాబును ఆపారు. దీంతో టీడీపీ నేతలకు.. పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది.

ఏపీలో ఉల్లి కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ప్రజల నిత్యావసరాల సరకులను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు. కానీ జగన్‌ రెడ్డి గారు చేసే మేలు.. ఉల్లి కూడా చేయదు.. అందుకే ఉల్లి ఎందుకు అనవసరమని, దాని రేటు పెంచేశారు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉల్లి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతు బజార్ల వద్ద కిలో మీటర్ల మేర బారులు తీరుతున్న ప్రజలే ఇందుకు తార్కారణం అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు పవన్.

Similar News