దొంగలు.. బాబోయ్ దొంగలు.. ఎక్కడ చూసినా ఉల్లి దొంగతనాలు.. బంగారం, డబ్బు దోచుకోవడం మర్చి పోయారు నేటి దొంగలు.. అంతా కలికాలం.. ఉల్లి మాయాజాలం.. ఉల్లి చోరులు ఎక్కువవుతున్నారు అని ప్రతి గల్లీ తిరిగి పోలీసులు చాటింపు వేయాల్సిన రోజులు వచ్చాయి. ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పించినా.. ఉల్లి లేని కూరతో అన్నం తింటే ముద్ద దిగట్లేదని.. దొరికితే కదా దొంగ అని ఉల్లిపాయలను దొంగిలిస్తున్నారు. ఆనక కటకటాలపాలవుతున్నారు.
పండించిన ఉల్లి పంట ఇంటికి రాకుండానే దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఈ మద్య కాలంలో ఉల్లి నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా పంజాబ్ కపుర్తలలోని ఓ ఇల్లాలు.. వాళ్లాయన ఎన్ని సార్లు చెప్పినా పావు కిలో ఉల్లి పాయలు కూడా తీసుకురావట్లేదని పక్కింట్లో అరకేజీ ఉల్లి పాయలను చోరీ చేసింది. గప్ చిప్‌గా చేశాననుకుంది కానీ గడప అవతలే ఉన్న చింటు గాడిని పట్టించుకోలేదు. దీంతో వాడెళ్లి వాళ్లమ్మకు చెప్పనే చెప్పాడు.
ఆవిడ నానా మాటలు అని పోలీసులకు చెప్పింది. ఎంతో కష్టపడి కొనుక్కున్న ఉల్లిపాయలను చోరీ చేసిందంటూ ఆమె మీద కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు ఉల్లి చోరురాలిని అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి. గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో నివసిస్తున్న కిరణ్ అనే మహిళ ఇంట్లో చిన్న చిన్న సామాన్లతో పాటు ఉల్లి కూడా చోరీ అవుతోందని గుర్తించింది. దీంతో ఆమె ఇంట్లో సీసీ కెమెరా పెట్టి మరీ దొంగను పట్టుకుంది. పనిమనిషి పనే అని తెలుసుకుని ఆమెను పోలీసులకు పట్టించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.