మా ఆయన బంగారం అని మురిసి పోతోంది మధ్య ప్రదేశ్ భింద్ జిల్లాకు చెందిన వినీత. ఆమెకు దిలీప్‌తో తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. అయితే వినీత గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో ఎప్పుడూ ఊరి పనులతో బిజీగా ఉండేది. దీంతో ఆమె భర్త దిలీప్ బంగారం లాంటి ఆలోచన చేశాడు. ఏమేవ్.. భార్యా మణీ.. నన్ను, పిల్లల్ని చూసుకోవడానికి నీకు తీరుబడి లేదు. ఊళ్లోవాళ్ల పనులు చక్కబెట్టడమే సరిపోతుంది. మరి ఇల్లాలు లేని ఇల్లెలా ఉంటుందో తెలిసిందే కదా. అందుకే నామాట సావధానంగా విను. నేను మరొక పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఊ.. అంటే అని ఆమె అంగీకారం కోసం ఎదురు చూశాడు.
ఎందుకో ఆమెకు కూడా భర్త ఐడియా బాగానే అనిపించింది. బయటకెళ్లి చెడు తిరుగుళ్లు తిరక్కుండా బాగానే ఆలోచించాడు. పైగా ఆయన మనసులో మాటేదో నాకూ చెప్పాడు అని సంతోషించింది. ఎవరో ఎందుకు నా చెల్లెలు రచననే పెళ్లి చేసుకుంటే నాకూ బావుంటుంది.. మీకు బావుంటుంది అని పెళ్లి ఏర్పాట్లు చేసింది. అదే వేదికపై భర్తతో తాను మరోసారి దండ వేయించుకుంది పెళ్లి బట్టల్లో ముస్తాబై. నవంబర్ 26న ముగ్గురూ ఒక్కటయ్యారు. ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిలీప్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నా భార్య వినీతకు ఆరోగ్యం సరిగా లేదు. అదీకాక గ్రామసర్పంచ్ బాధ్యతలు. అందుకే మరో పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు.