తెలంగాణలోని చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. ఢిల్లీ నుంచే రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారని చెప్పింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పూర్తి సమాచారం తమ వద్ద ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనిపై ఎలాంటి వాదనలు జరక్కుండానే రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై విచారణ గురువారం కూడా కొనసాగనుంది.
చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధుల బృందం కూడా విచారణ జరిపింది. నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌ను పరిశీలించారు. మృతుల కుటంబసభ్యులను కలిసి.. వారి అభిప్రాయం తెలుసుకున్నారు. నిందితుల చేతిలో గాయపడిన పోలీసుల నుంచీ సమాచారం సేకరించారు. హైదరాబాద్‌లో వివిధ వర్గాల వాదనలు విన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగే విచారణలో NHRC నివేదిక కూడా కీలకం కానుంది.