పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఇటు ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ.. లక్నోలో నడ్వా యూనివర్శిటీల దగ్గర పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. రెండు యూనివర్శిటీల దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా కనిపించడంతో ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. క్యాంపస్ నుంచి విద్యార్థులను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల గేటును మూసివేయడంతో రెండు చోట్లా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గేట్లు మూసేయడంతో ఆవేశానికి లోనైన విద్యార్థులు.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. అంతా మూకుమ్మడిగా రాళ్ల దాడి చేయడంతో.. పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీలు ఝులిపించారు.
హాస్టళ్లను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లాలని విద్యార్థులను పోలీసులు ఆదేశిస్తున్నారు. అయినా విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేయడానికి ససేమిరా అనడంతో పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో జామియా యూనివర్సిటీకి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.