నిర్భయ దోషులకు ఉరి శిక్షే సరైన శిక్షని సుప్రీం కోర్టు తేల్చేసింది. అక్షయ్ కుమార్ కోరినట్టు తీర్పును రివ్యూ చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. అక్షయ్ కుమార్ తో పాటు మిగతా ముగ్గురు దోషులు కూడా ఉరిశిక్షకు అర్హులేనని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, చట్టప్రకారం గడువులోగా రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
అక్షయ్ కుమార్ పిటిషన్ పై జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ బొపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ భానుమతి కేవలం అరగంటలోనే తీర్పును వెలువరించారు. తీర్పు ప్రతిని ఆమె స్వయంగా చదివి వినిపించారు.
దోషులకు సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే ఉరిశిక్ష విధించింది. డిసెంబర్ 16న ఉరిశిక్షకు డేట్ కూడా ఫిక్సయింది. అయితే, దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్ ను విచారణకు స్వీకరించడంతో.. ఉరికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక, తాజా తీర్పుతో ఉరిశిక్ష అమలుకు లైన్ క్లియరైంది.
లిస్టింగ్ ప్రకారం.. అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్ పై.. మంగళవారమే విచారణ జరగాల్సి వుంది. అయితే, చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ఆకస్మికంగా తప్పుకున్నారు. దీంతో విచారణ ఒక్కరోజు వాయిదాపడింది. దీనిపై మంగళవారం సాయంత్రమే కొత్త ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఇక, తాజా తీర్పుతో నిర్భయ దోషుల ఉరిశిక్షకు అడ్డంకులు తొలగినట్టయింది. రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే తప్ప.. ఉరిశిక్ష అమలు ఖావడం దాదాపు ఖాయమైనట్టే.
సరిగ్గా ఏడేళ్ల క్రితం.. 2012 డిసెంబర్ 16న.. దేశ రాజధాని నడిబొడ్డున.. ఓ పారామెడికల్ విద్యార్థినిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. కదులుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు కర్కోటకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో రామ్ సింగ్ అనే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ గా తేలడంతో జువైనల్ హోంలో శిక్ష విధించారు. ఇక, ప్రస్తుతం అక్షయ్ కుమార్, వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ సింగ్ లకు తాజాగా సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించింది.
ఇదిలావుంటే, సుప్రీం కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని కోరారు.
అయితే, అక్షయ్ కుమార్ తరఫు లాయర్ మాత్రం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని అన్నారు. ఆ తర్వాతే క్షమాభిక్షకు వెళ్తామని చెప్పారు.
ఉరిశిక్షకు లైన్ క్లియర్ కావడంతో.. దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తీహార్ జైల్లో ఉరితీసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బక్సర్ జైలు నుంచి ఇప్పటికే ఉరితాళ్లు ఆర్డర్ చేశారు. ఈ తాళ్లతో ఇప్పటివరకు కోల్ కతా అలీపూర్ జైల్లో రేపిస్టు ధనుంజయ్ ఛటర్జీని ఉరితీశారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ లను ఈ తాళ్లతోనే ఉరితీశారు. అయితే, తీహార్ జైల్లో ఒకే సమయంలో ఇద్దరికి మాత్రమే ఉరివేసేలా చాంబర్ వుంది. దీన్ని 1950లో నిర్మిచారు. అయితే ఇద్దరికి ఒకసారి, మరో ఇద్దరికి ఆ తర్వాత శిక్ష విధించడం సాధ్యం కాదు. ఎందుకంటే, మొదట ఇద్దరికి ఉరిశిక్ష అమలు చేసినప్పుడు.. మిగతా ఇద్దరు దోషుల్లో బిహేవియర్ చేంజెస్ ఉండే అవకాశం వుంటుంది. అంటే, స్పృహ తప్పి పడిపోయినా.. షాక్ కు గురైనా.. శిక్ష అమలు సాధ్యం కాదు. అందుకే నలుగురినీ ఒకేసారి ఉరి తీసేలా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక, కొత్త జైలు నిబంధనల ప్రకారం.. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరిస్తే.. 14 రోజుల తర్వాతే మరణశిక్ష విధించాల్సి ఉంటుంది. దోషుల కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉరి తీస్తున్నారో సమాచారం ఇవ్వాలి. ఈ గ్యాప్ లో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. తమ వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేసే ఛాన్స్ ఉంది. ఉరి వేసే ఒకరోజు ముందు దోషులు కోరుకున్న ఆహారం అందించాలి. వారు కోరుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని కొత్త జైలు నిబంధనలు చెబుతున్నాయి.
మొత్తానికి, అభం శుభం తెలియని ఓ అబల మానప్రాణాలను హరించిన కర్కోటకులు ఉరిశిక్ష పడటంపై దేశం వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.