ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉండాలి. అది అమరావతే! ఇదే నినాదం రాజధాని ప్రాంత గ్రామాల్లో మార్మోగింది. తూళ్లూరు, మందడం, వెలగపూడి, కురగల్లు, నీరుకొండ, రాయపూడి, ఉద్దండరాయని పాలెం సహా అన్ని గ్రామాలు నిరసనలతోహోరెత్తాయి. పలు ప్రాంతాల్లో చేతుల్లో పురుగుమందు డబ్బాలు పట్టుకొని ఆందోళనకు దిగారు.
సచివాలయం ముట్టడికి రాజధాని రైతులు ప్రయత్నించారు. మందడం సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన రైతులు వెలగపూడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఐతే.. ఎక్కడిక్కడ బందోబస్తు ఉండడంతో మధ్యలోనే అడ్డుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
రాజధాని కోసం తమ విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు మోసం చేశారంటూ రైతులు మండిపడ్డారు. తమ త్యాగాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. అమరావతిని తరలించాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులే కాదు, మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రజా సంఘాలు కూడా ఆందోళలో పాల్గొన్నాయి.
రాజధాని ప్రాంత రైతులు ఐక్య కార్యాచరణ ప్రకటించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 9 గంటలకు మందడంలో మహాధర్నా చేయాలని నిర్ణయించారు. అలాగే తుళ్లూరు గ్రామంలో మహిళలు రోడ్డుపై వంట వార్పు తో నిరసన తెలపనున్నారు. ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే తమకు స్పూర్తి అంటున్న రాజధాని రైతులు.. కలిసివచ్చే పార్టీలతో కలిసి పోరాటం కొనసాగిస్తామన్నారు.