ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన ఉధృతం

Update: 2019-12-19 09:24 GMT

ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన ఉధృతంగా సాగుతోంది.. మూడు రాజధానులపై సీఎం జగన్‌ చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, మహిళలు అంతా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.. ఉదయం నుంచి నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు.. అటు రాజధాని ప్రాంత గ్రామాల్లో స్వచ్ఛందంగా బంద్‌ నిర్వహిస్తున్నారు.. తూళ్లూరు, మందడం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎక్కడికక్కడ రాకపోకలను అడ్డుకున్నారు. వెగలపూడి, కురగల్లు, నీరుకొండ, రాయపూడి గ్రామాల్లోనూ ఆందోళనకు దిగారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. వెంకటపాలెం వద్ద బస్సులు నిలివేయండతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. మూడు కిలోమీటర్లు నడిచి సెక్రటెరియట్‌కు వెళ్లారు.

రాజధాని కోసం తమ విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు మోసం చేశారంటుూ అమరావతి రైతులు మండిపడుతున్నారు. తమ త్యాగాలను గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలంటున్నారు. అమరావతిని తరలించాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.. రైతులే కాదు, మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రజా సంఘాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి..

సచివాలయం ముట్టడికి రాజధాని రైతులు ప్రయత్నించారు. మందడం సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన రైతులు వెలగపూడికి వెళ్తే ప్రయత్నం చేశారు. ఐతే.. ఎక్కడిక్కడ బందోబస్తు ఉండడంతో రైతుల్ని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Similar News