పీపీఏలపై ఏపీ హైకోర్టులో జగన్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Update: 2019-12-20 11:22 GMT

PPA ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. గతంలో చేసుకున్న ఒప్పందాలను పక్కనబెట్టడంతో... సోలార్‌, విండ్‌ పవర్‌ సంస్థలకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మూడు కంపెనీలకు రూ. 1400 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో... టాటా పవర్‌ సహా పలు కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. అగ్రిమెంట్లు ఉన్నా పవర్‌ కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేశాయి. డ్యామేజెస్‌ కింద తమకు సొమ్ము చెల్లించాలని కోర్టును కోరాయి. జగన్‌ సీఎం అయినప్పటి నుంచి విండ్‌, సోలార్‌ పవర్‌ కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. కేంద్రం ఆదేశాలను సైతం జగన్‌ సర్కారు బుట్ట దాఖలు చేసింది. దీంతో పవర్‌ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి.

పీపీఏల విషయంలో జగన్‌ సర్కారు మొదట్నుంటి ప్రతికూల వైఖరినే కొనసాగిస్తోంది. వీటి అమలు వల్ల నష్టాలు వస్తాయంటూ.. వాటిని పక్కనబెట్టాలని చూసింది. అయితే ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గడం సరైంది కాదని కేంద్రం పలు మార్లు నచ్చజెప్పింది. దీని వల్ల పెట్టుబడి పెట్టిన సంస్థలు నష్టపోతాయి.. మిగతా సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తాయని కేంద్రం చెప్పింది. పలు మార్లు కేంద్రం ఇలా హెచ్చరికలు జారీ చేసినా.. రాష్ట్ర సర్కారు వాటిని పట్టించుకోలేదు. ఒప్పందాలు అమల్లో ఉన్నప్పటికీ.. సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయలేదు. దీంతో అనేక సంస్థలు నష్టాలపాలయ్యాయి.

Similar News