అమారావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావిస్తే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఎవరైనా తప్పుచేస్తే కఠినంగా శిక్షించాలని.. దానికి తామూ సహకరిస్తామన్నారు.
అమరావతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిని శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతమంటూ మంత్రులు మాట్లాడమేంటని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో ఒక్క ఎకరా కూడా ముంపునకు గురికాదని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని.. జగన్ ఏ రాజ్యంగంలో మూడు రాజధానులు గురించి చదివారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అమరావతిలో ఉండి.. సచివాలయం వైజాగ్‌లో ఉంటే పరిపాలన ఎలా సాగుతుందని నిలదీశారు.
విశాఖ అభివృద్ధికి టీడీపీ వ్యతిరేకం కాదని.. అమరావతిలో రైతులకు ఇచ్చిన హామీ ముఖ్యమన్నారు. గతంలోనే విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించామని.. ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు గుర్తు చేశారు.
అమరావతి బంగారు బాతు లాంటింది అన్నారు చంద్రబాబు. రాజధాని నిర్మాణానికి డబ్బులేదని చెబుతున్నారని.. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇక్కడ ఉండే ఆస్తులపై వచ్చే ఆదాయంతో పూర్తి చేయవచ్చని చంద్రబాబు అన్నారు.
మూడు రాజధానులపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీకి జగన్ మోహన్ రెడ్డి కమిటీ అని పేరుపెట్టాలన్నారు. సీఎం పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుందని ఎద్దేవా చేశారు.
2014లో అసెంబ్లీ వేదికగా చర్చ జరిగినపుడు జగన్ విజయవాడలో రాజధానిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారని.. రాజధానికి 30వేల ఎకరాలు ఉండాలని సూచించారని గుర్తుచేశారు. ఇప్పుడే అదే వ్యక్తి ఎందుకు మాటతప్పారని నిలదీశారు.