ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు తమ భూములు ఆక్రమించారంటూ స్పందనలో ఫిర్యాదు అందింది. విజయనగరంలోని సత్యసాయి నగర్ లేఔట్ హక్కుదారులు కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో కంప్లైంట్ చేశారు. 37 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకుని కొనుగోలు చేశామని వాళ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ చేసుకునే తాము ముందుకెళ్లామని చెప్పారు. తమ దగ్గర అన్ని పత్రాలు, అనుమతులు ఉన్నా.. మంత్రి బొత్స సోదరుడు ఆదిబాబు.. తమ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారని బాధితులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రజలకు సమస్య వస్తే.. దాన్ని తీర్చాల్సిన నాయకులే.. సమస్యలు సృష్టించడం ఏమిటని సత్యసాయి నగర్ లేఔట్ వాసులు ప్రశ్నించారు. అర్థబలం, అంగబలం, రాజకీయ పలుకుబడితో మొత్తం స్థలం కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో జిల్లా ఉన్నతాధికారులను కోరారు. భూ కబ్జాకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని వాళ్లు కోరారు.