మున్సిపోల్స్‌కి అభ్యర్థుల వేట ప్రారంభించిన కాంగ్రెస్

Update: 2019-12-24 13:21 GMT

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కాంగ్రెస్‌లో కోలాహాలం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు.. 10 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌.. అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించింది. గతంలోనే పీసీసీ ఏర్పాటు చేసిన ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ పలుమార్లు సమావేశమై అభ్యర్ధుల ఎంపిక విధివిధానాలపై చర్చించింది. ఈ కమిటీ.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు ఇతర ముఖ్యనేతలతో సుదీర్ఘంగా చర్చించింది. స్థానిక నాయకత్వం ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరిగితే.. మెరుగైన ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయానికి వచ్చారు కాంగ్రెస్ పెద్దలు.

అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు, ఎక్కడైన సమస్యలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించేందుకు ఈ ముగ్గురు సభ్యుల కమిటీ పని చేస్తుంది. స్థానికంగా ప్రజాధరణ కలిగి ఉండడం, పార్టీకి విధేయులై ఉండడం, ప్రత్యర్ధులను సమర్ధంగా ఎదుర్కొనగలిగే సత్తా ఉండడం, అందరిని కలుపుకుని ముందుకు వెళ్లగలగడం లాంటి వ్యక్తులనే ఎంపిక చేయాలని డీసీసీలకు పార్టీ సూచనలు చేసింది. అలాగైతేనే.. గెలిచిన తరువాత పార్టీని వీడకుండా ఉంటారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. డీసీసీల ప్రమేయంతో ఎంపిక జరిగితే .. ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్ధుల గెలుపునకు సహకరిస్తారని పీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి మొదటివారంలో విడుదల కానుంది. అంతకంటే ముందే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానుండగా మరుసటి రోజున వార్డుల రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. వార్డులు, మేయర్లు, ఛైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు కానిది.. అభ్యర్ధుల ఎంపిక సాధ్యం కాదు. దీంతో.. అప్పటి వరకు నలుగురు లేదా ఐదుగురితో కూడిన ఆశావహుల జాబితాతో సిద్ధమవుతోంది కాంగ్రేస్. రిజర్వేషన్లు ఖరారు కాగానే .. అధికార పార్టీ అభ్యర్థి ఎవరు బరిలో నిలుస్తారో.. అంచనా వేసుకుని అందుకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు వీలుగా కసరత్తు పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు.

ఈ మున్సిపోల్స్‌లో స్థానిక సమస్యలే ప్రధాన అజెండాగా గులాబీ సర్కార్‌ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ త్రీ-మెన్ కమిటీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. తెలంగాణ బచావో కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల నేపథ్యంలో నిరసన ఉద్యమాలను మరింత ఉధృతం చేయనుంది.

Similar News