తారాస్థాయికి చేరుకుంటున్న అమరావతి రైతుల ఆందోళనలు

Update: 2019-12-26 13:30 GMT

అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. 29 గ్రామాలు నిరసనలతో వేడెక్కాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నా, కృష్ణాయపాలెంలో వంటావార్పు, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్న రైతులు.. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేపిటల్‌ను తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. రైతులతోపాటు, మహిళలు, చిన్నపిల్లలు కూడా రోడ్డెక్కి సేవ్‌ అమరావతి అంటూ నినదిస్తున్నారు.

రాజధాని గ్రామాల రైతులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిశారు. కేపిటల్‌ను అమరావతిలోనే కొనసాగించాలంటూ వినతిపత్రం అందజేశారు. 9 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యపై జోక్యం చేసుకోవాలంటూ కోరారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ఆఫీస్ వద్దకు రైతులు చేరుకోవడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. రాజధానిని తరలించొద్దంటూ కొంతమంది రైతులు, నేతలు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు.

అమరావతికి వచ్చే టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గంటూరు జిల్లా పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రాజధానిలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నేతలు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమన్నారు ధూళిపాళ్ల.

శుక్రవారం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో.. అడుగడుగునా ఆంక్షలతో రాజధాని గ్రామాల్లో నిర్బంధకాండ కొనసాగుతోంది. మందడం, వెలగపూడితో పాటు ఇతర గ్రామాల్లో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిరసనలు, దీక్షలు, ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేసిన పోలీసులు.. గ్రామాల్లోకి వచ్చిపోయేవారిని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న రైతుల నివాసాలకు నోటీసులు జారీ చేశారు. దీంతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను పోలీసులు ఉగ్రవాదుల్లా చూస్తున్నారని మండిపడుతున్నారు.

శుక్రవారం శాంతియుతంగా చేపట్టే నిరసనలకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు రాజధాని రైతులు. మందడంలో డీఎస్పీ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో సీఐకి వినతి పత్రం ఇచ్చారు. అటు ఉండవల్లిలో మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిశారు రైతు సంఘం, అఖిలపక్ష నేతలు. రాజధానిని తరలించవద్దంటూ మోపిదేవికి వినతిపత్రం అందజేశారు.

రాజధాని తరలింపును నిరసిస్తూ పెనుమాక రైతు దీక్ష శిబిరం దగ్గర రమేష్‌ అనే రైతు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది.

ఇప్పటి వరకు రాజధాని గ్రామాలకే పరిమితమైన ఆందోళనలు.. ఇప్పుడు జిల్లాలకు వ్యాపించాయి. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ చిత్తూరు జిల్లా చంద్రగిరి టవర్‌ క్లాక్‌ వద్ద టీడీపీ మహాధర్నా నిర్వహించింది. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పురిటిగడ్డ గ్రామంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. గుంటూరు నరసరావుపేటలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లిలో రిలే దీక్షలు చేపట్టారు.

Similar News