రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ సీరియల్ కిల్లింగ్ కేసు విచారణ ముగింపు దశకు చేరుకుంది. ఈ కేసులో యాదాద్రి- భువనగిరి జిల్లా హాజీపూర్‌లో శ్రావణి, మనీషా, కల్పన అనే ముగ్గురు విద్యార్థినులు దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డే.. ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడని తేలింది. తీవ్ర సంచలనం రేపిన ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చేపట్టారు. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అక్టోబర్‌లో ప్రారంభమైన విచారణ కొలిక్కి చేరుకుంది. మూడు కేసుల్లో వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఇప్పటికే బాధితుల కుటుంబ సభ్యుల తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. గురువారం శ్రీనివాస్ రెడ్డి వాదనన విననుంది. ఆ తర్వాత.. రెండు పక్షాల వాదనలు కొనసాగుతాయని.. అది పూర్తయ్యాక.. తీర్పు వెలువడుతుందని కేసు వాదిస్తున్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ రెడ్డి తెలిపారు.