కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఉత్తరప్రదేశ్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. యూపీ పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ప్రియాంక ఆరోపించారు. తనను మెడపెట్టి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తకు సంబంధించిన వెహికిల్‌పై వెళ్తున్న సందర్భంలోనూ అడ్డుకొని మెడపట్టుకొని కిందికి తోసేశారని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దేశాన్ని కాపాడండి-రాజ్యాంగాన్ని రక్షించండి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రియాంక హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత ర్యాలీగా వెళ్లడానికి ప్రియాంక ప్రయత్నించారు. ఇందుకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. ర్యాలీకి అనుమతి లేదని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఈ వాదనను తిరస్కరించిన ప్రియాంక, పార్టీ కార్యకర్త వెహికిల్‌పై వెళ్లడానికి ప్రయత్నించారు. అది వీలు కాకపోవడంతో నడిచివెళ్లే ప్రయత్నం చేశారు. ఐతే, పోలీసులు తనను పదే పదే అడ్డుకున్నారని, పార్టీ కార్యకర్తలను కూడా కలవనివ్వలేదని ప్రియాంక మండిపడ్డారు.
యూపీ పోలీసులపై ప్రియాంక ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పోలీసులు అమర్యాదగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.