భారత రక్షణ దళపతిగా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతల స్వీకరణ

Update: 2020-01-01 08:59 GMT

భారత రక్షణ దళాల తొలి అధిపతిగా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత సైనిక గౌరవ వందనం స్వీకరించి.. భారత తొలి సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.

1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్.. 2017 జనవరి 1 నుంచి మూడేళ్ల పాటు.. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, సీడీఎస్ హోదాలో మరో మూడేళ్ల పాటు పనిచేయన్నారు. ఇక, సీడీఎస్ హోదాలో పలు అంశాలపై తొలిసారి స్పందించారు బిపిన్ రావత్. సైన్యాన్ని రాజకీయం చేస్తున్నారని ఇటీవల తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. భద్రతా దళాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తామని అన్నారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా తను పోషించబోయే పాత్ర పైనా రావత్ స్పష్టతనిచ్చారు. సీడీఎస్ కు స్పష్టమైన లక్ష్యాలు వుంటాయన్న ఆయన.. మూడు దళాలు సమన్వయంతో పనిచేసేలా చూడటమే సీడీఎస్ బాధ్యత అన్నారు. తామంతా టీమ్ వర్క్ తో పనిచేస్తామని.. విడివిడిగా సాధించే ఫలితాలకంటే, త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేస్తే ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చని అన్నారు. ఇందుకోసం కలిసి ముందుకు సాగుతామని తెలిపాు. మానవ, ఆయుధ వనరులను సద్వినియోగం చేసుకోవడం, సంయుక్త శిక్షణపై సీడీఎస్ దృష్ట పెట్టాల్సిన అవసరం వుందన్నారు.

1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఎదురైన సమస్యలను అధిగమించడానికి.. విపత్కర పరిస్థితుల్లో త్రివిధ దళాను సమన్వయం చేసేందుకు.. కేంద్రం ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ నియమించాలని నిర్ణయిచింది. డిసెంబర్ 24న జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో సీడీఎస్ ఏర్పాటుపై అధికారిక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో తొలి సీడీఎస్ గా తాజా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఎంపికయ్యారు. ఇక, కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఆయన భారత తొలి సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ సౌత్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన సీడీఎస్ కార్యాలయం నుంచి ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. సీడీఎస్ పదవిలో రావత్ మూడేళ్ల పాటు కొనసాగుతారు. విపత్కర పరిస్థితులు, యుద్ధ సమయాల్లో త్రివిధ దళాలను సమన్వయం చేస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేయడం సీడీఎస్ విధి.

సీడీఎస్ పదవిలో 65 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగవచ్చు. సీడీఎస్ రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తారు.

Similar News