IMS కుంభకోణంలో బయటపడిన మరో అవినీతి తిమింగళం

Update: 2020-01-01 04:56 GMT

ఓ మెడికల్‌ ఏజెంట్.. తర్వాతి కాలంలో సంస్థను స్థాపించాడు. కోట్లు సంపాదించాడు. సాధారణంగా ఇదో ఇన్‌స్పిరేషన్‌ స్టోరీ. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే వ్యక్తి. కానీ.. అతను మామూలోడు కాదు. మహా మాయగాడు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు.. చూపించి కోట్లు కొల్లగొట్టిన జగత్‌ కంత్రీ. బీమా వైద్య సేవలు-IMS కుంభకోణంలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. అతని పేరు శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ. ఓమ్నీ మెడ్ సంస్థ యజమాని. IMS డైరెక్టర్‌ హోదాలో పనిచేసిన దేవికారాణి, జేడీ హోదాలో పనిచేసిన పద్మతో చేతులు కలిపినందుకు.. శ్రీహరి బాబు ఊచలు లెక్కించాల్సి వస్తోంది.

IMS కుంభకోణంలో రోజుకోరకం మోసం వెలుగు చూస్తోంది. కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న ఓమ్ని మెడ్‌ సంస్థ యజమాని కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ చేసిన మరో మాయాజాలాన్ని ఏసీబీ గుర్తించింది. మెడికల్‌ కిట్ల కొనుగోలు పేరుతో డబ్బు కొట్టేయడానికి ‘లెజెండ్‌’ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి కోట్లకు కోట్లు మాయం చేసినట్టు తేలింది. అతని కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాల్లో కళ్లు చెదిరే అక్రమాలు వెలుగు చూశాయి. శ్రీహరిబాబు పేరుతో 99 కోట్ల రూపాయలు విలువైన షేర్లు, 24 కోట్ల రూపాయలు విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిబాబు భార్య పేరుతో మరో 7 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాల్ని కనుగొన్నారు.

2017-18 ఏడాదిలో జరిపిన 110 కోట్ల IMS లావాదేవీలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఇతర వ్యాపారాల్లో ఈ సొమ్మును వెనకేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 19 కోట్ల రూపాయల ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించినట్లు స్పష్టమైంది. లెజెండ్‌ పేరుతో డొల్ల కంపెనీని తన సన్నిహితుడు కృపాసాగర్‌రెడ్డి పేరుతో సృష్టించినట్లు గుర్తించారు. తొలుత లెజెండ్‌కు నిధులు మళ్లించి.. తిరిగి ఓమ్ని మెడ్‌ సంస్థకు బదిలీ చేసినట్లు తేలింది. దీంతో.. శ్రీహరిబాబును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న లెజెండ్‌ సంస్థ యజమాని కృపాసాగర్‌రెడ్డి, ప్రతినిధి వెంకటేశ్వర్లు కోసం గాలిస్తున్నారు.

IMS అధికారులతో చేతులు కలిపిన శ్రీహరిబాబు.. పెద్ద మొత్తంలో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశాడు. అందులో లెజెండ్‌ ఒకటిగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మిత్రుడు కృపాసాగర్‌ రెడ్డికి దాని బాధ్యతలు అప్పగించాడు. లెజెండ్‌ కంపెనీకి ఆథరైజేషన్‌ ఇప్పించి మెడికల్‌ కిట్ల ఆర్డర్లు కట్టబెట్టారు. వాటి సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారు. ఇండెంట్‌లో ఉన్నవాటి కంటే తక్కువ కిట్లు సరఫరా చేసి బిల్లులు క్లెయిమ్‌ చేశారు. గ్లూకోజ్‌ క్యూవెట్‌ కిట్‌ ఒక్కొక్కదాని మార్కెట్‌ ధర 19 వందల 50 రూపాయలు ఉండగా... దాన్ని 6వేల200 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మొత్తం 4 వేల 500 కిట్లకు.. ఎంత మొత్తం నొక్కేశారో అర్థం చేసుకోవచ్చు. తెల్ల రక్తకణాల్ని పరీక్షించేందుకు 6వేల 291 కిట్ల కొనుగోళ్లలో షెల్‌ కంపెనీలకు 12 కోట్ల 85 లక్షలు ఎక్కువ సొమ్ము చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.

మెడికల్‌ కిట్ల సరఫరాకు సంబంధించి లెజెండ్‌ సంస్థ ఖాతాలో జమైన 54 కోట్ల రూపాయలు.. ఆ తర్వాత శ్రీహరిబాబు ఖాతాలోకి మళ్లినట్లు ఏసీబీ పూర్తి ఆధారాలు సేకరించింది. దాంతో, మిగతా కిట్ల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగనుంది. IMS డైరెక్టర్‌ హోదాలో పనిచేసిన దేవికారాణి కనుసన్నల్లో... ఆమె సంతకంతోనే... ఈ అక్రమాలన్నీ జరిగినట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో శ్రీహరిబాబు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

తెల్ల రక్తకణాల సంఖ్య, గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించేందుకు అవసరమైన కిట్ల కొనుగోలు పేరుతో ఈ ముఠా అక్రమాలకు పాల్పడింది. స్వీడన్‌కు చెందిన హిమోక్యూ సంస్థ నుంచి క్యూవెట్‌ స్ట్రిప్‌లు కొన్నట్లు నిధుల్ని దారి మళ్లించారు. డిస్పెన్సరీల నుంచి ఇండెంట్లు రాకుండానే నేరుగా పద్మ కార్యాలయంలోనే కొనుగోలు ఉత్తర్వులు సృష్టించేవారు. వాటిపై దేవికారాణి సంతకాలు చేశారు. హిమోక్యూ నుంచి కిట్ల కొనుగోలుకు షెల్ కంపెనీ అయిన లెజెండ్‌కు ఆథరైజేషన్‌ ఇచ్చినట్లు నకిలీ పత్రాల్ని సృష్టించారు. ఒక్కో కిట్ విలువ 11 వేల 800 కాగా.. అదనంగా 25 వేలు వెచ్చించినట్లు లెక్కలు రాశారు. ఆ మొత్తం తొలుత లెజెండ్‌ సంస్థ ఖాతాలో పడింది. అక్కడి నుంచి శ్రీహరిబాబుకు వెళ్లేవి. అటునుంచి దొంగలంతా వాటాలేసుకుని పంచుకునేవారు. అలా ప్రభుత్వ ఖజానా నుంచి 54 కోట్లను లెజెండ్‌కు అక్రమంగా చెల్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Similar News