అమరావతి రైతుల మహాపాదయాత్ర

Update: 2020-01-06 09:04 GMT

రాజధాని కోసం రైతుల పోరాటం ఉధృతమవుతోంది. ఇప్పటి వరకు నిరసనలు, ధర్నాలు, రిలే దీక్షలతో హోరెత్తించిన రైతులు.. తుళ్లూరులో మహా పాదయాత్ర చేపట్టారు. మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా పాదయాత్రలో పాల్గొన్నారు. సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. తుళ్లూరు నుంచి వెలగపూడి మీదుగా మందడం వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. నాడు పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్‌.. ఇప్పుడు ప్రజలందరినీ రోడ్డు మీదకు ఈడ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమను పెయిడ్‌ ఆర్టిస్టులంటూ అవహేళన చేసి మాట్లాడుతున్నారని ఫైరవుతున్నారు. 33వేల ఎకరాల భూములు తీసుకుని నిలువునా మోసం చేశారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజధాని గ్రామ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

అటు అమరావతి గ్రామాల రైతులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వేలాదిగా రైతులు బైక్‌ ర్యాలీలో పాల్గొంటున్నారు. తుళ్లూరులో మొదలైన బైక్‌ ర్యాలీ వెలగపూడి మీదుగా మందడం వరకు కొనసాగనుంది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసులు ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.

Similar News