ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కోర్టుకు హాజరైన జగన్

Update: 2020-01-10 07:23 GMT

ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌.. నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి. సీబీఐ, ఈడీ కోర్టుల్లో జగన్ ఆస్తుల కేసు విచారణ జరుగుతోంది.

గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌ నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, ధర్మానప్రసాదరావు, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త ఇందూ శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్‌ శామ్యూల్‌ తదితరులు విచారణకు హాజరయ్యారు. గత 8 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు రావడం ఇదే తొలిసారి.

సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లతోపాటు ఈడీ నమోదు చేసిన 6 అభియోగ పత్రాలకు సంబంధించి విచారణకు శుక్రవారం జగన్‌, విజయసాయిరెడ్డి కచ్చితంగా హాజరుకావాలని ఈ నెల 3న సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్‌ గత ఏడాది మార్చి 22న చివరి సారిగా కోర్టుకు హాజరయ్యారు. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది. అయితే ముఖ్యమంత్రిగా వివిధ కార్యక్రమాలను చూపుతూ.. జగన్‌ ప్రతి శుక్రవారం హాజరు నుంచి మినహాయింపు పొందారు. ప్రతి శుక్రవారం మినహాయింపు కోరడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. శుక్రవారం కచ్చితంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

జగన్‌పై మొత్తం 11 చార్జి షీట్లు దాఖలయ్యాయి. 2011 ఆగస్టు 17న హైకోర్టు ఆదేశాలతో జగన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 120.బి.రెడ్‌ విత్‌ 420, 409, 477 ఐపీసీతోపాటు 13(2) రెడ్‌ విత్ 13(1)(సి)తోపాటు (డి).పిసి యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 2012 మే 25న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపారు. 16 నెలల జైలు జీవితం గడిపాక 2013 సెప్టెంబర్‌ 23న జగన్‌ విడుదలయ్యారు.

2012 మార్చి 31న జగన్‌పై సీబీఐ మొదటి చార్జిషీట్‌ దాఖలు చేసింది. హెటిరో, అరబిందో గ్రూప్‌లకు చెరో 75 ఎకరాలు కేటాయించారు. అందుకు గాను జగన్‌ కంపెనీల్లో.. 29 కోట్ల 50 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలున్నాయి. ఇలా.. 11 చార్జిషీట్లు దాఖలయ్యాయి. చివరి చార్జిషీటు 2014 సెప్టెంబర్‌9 ఇందు ప్రాజెక్ట్‌ వ్యవహారంలో దాఖలైంది. చాలా చార్జిషీట్లలో నాటి మంత్రులు, పలువురు ఐఏఎస్‌ అధికారుల పేర్లను సీబీఐ చార్జిషీట్లలో దాఖలు చేసింది.

Similar News