ఆంక్షల వలయంలో అమరావతి

Update: 2020-01-11 07:06 GMT

అమరావతి ఆంక్షల వలయంలో ఉంది. క్షణక్షణానికీ పోలీసుల మోహరింపు పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. శనివారం రైతుల్ని ధర్నాలకు, నిరసనలకు కూడా రానివ్వడం లేదు. 144 సెక్షన్ అమల్లో ఉందని, గుంపుగా తిరగొద్దని మైకుల్లో ప్రకటనలు చేస్తూ, గ్రామాల్లో కవాతులు చేస్తున్నారు. స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసేలా అక్కడ పరిస్థితులున్నాయి. వెలగపూడిలో రోజూ రైతులు నిరసన తెలిపే ప్రాంతానికి శనివారం ఎవరినీ వెళ్లనివ్వలేదు. దీంతో.. ఆ దీక్షా శిబిరానికి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కూర్చుని రైతులు ధర్నా కొనసాగిస్తున్నారు. తుళ్లూరులోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 25వ రోజుకు నిరసనలు చేరడంతో.. ఆంక్షలు మరింత పెరిగాయి. మందడంలోనూ రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో చివరికి ఓ ప్రైవేట్ స్థలంలో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

గుళ్లకు వేసిన తాళాలు తీయలేదు. స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు. ఏ ఇద్దరు కలిసినా, మాట్లాడుకుంటున్నా నిఘా. ఇంత దారుణంగా పోలీసులు కట్టడి చేయడంపై అన్నదాతలు రగిలిపోతున్నారు. వైసీపీ నేతలు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంత దారుణాన్ని చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని.. అమరావతి కోసం పోరాటంలో వెనకడుగు వేసేది లేదని చెప్తున్నారు.

Similar News