అసెంబ్లీలో 150 మంది ఒకవైపు.. నేను ఒక్కడినే ఒకవైపు.. భయపడే ప్రసక్తే లేదు : చంద్రబాబు

Update: 2020-01-11 16:05 GMT

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమరావతి నుంచి రాజధానిని మార్చడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. తనను హైదరాబాద్ లో అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోందని, ఇలాంటి వాటికి బయపడే ప్రసక్తి లేదన్నారు.

రాజధాని అంశాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. అమరావతిని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముందు నుంచి అమరావతి మార్పుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారని, ఒకదశలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేశారన్నారు. నిజంగా అదే జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చుకదా అని ప్రశ్నించారు.

తనకు అధికారం ముఖ్యం కాదని, సేవే పరమావధిగా పనిచేస్తున్నానని అన్నారు చంద్రబాబునాయుడు. అందరికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం తనకు ఉందని.. అసెంబ్లీలో 150 మంది ఒకవైపు.. నేను ఒక్కడినే ఒకవైపు అన్నారు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదన్నారు.

అమరావతి మార్పుపై రాజధానిలోని మహిళలు కదం తొక్కి ఉద్యమిస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. మందడం, తుళ్లూరులో మహిళలు చూపిన ఉద్యమ స్పూర్తి ప్రతి జిల్లాలో కనిపించాలన్నారు. అన్నిప్రాంతాల ప్రజలు నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News