ఓ అమ్మాయి కావాలి.. ఇద్దరం కలిసి అంతరిక్షంలోకి వెళ్లాలి: బిలియనీర్ ప్రకటన

Update: 2020-01-13 11:05 GMT

ఓ 20 ఏళ్ల అమ్మాయి కావాలి. ఆమెని తీసుకుని చంద్ర మండల యాత్ర చేసొస్తా. ఎవరైనా ఉంటే చెప్పరూ అని అంటున్నారు జపాన్ కుబేరుడు. ఆన్‌లైన్ ఫ్యాషన్ వ్యాపార దిగ్గజం యుసాకు మేజావా. 44 ఏళ్ల వయసులో ఒంటరిగా బతుకుతున్నాను. ఏదో వెలితిగా ఉంది. ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు సంతానం ఉన్నా ఎందుకో ఒంటరినన్న భావన కలుగుతోంది. ఇకపై ఒక మహిళతోనే నా జీవితం కొనసాగించాలనుకుంటున్నాను. ఆమెను తీసుకుని చంద్రమండలం చుట్టేయాలనుకుంటున్నాను అని ఓ ప్రకటన ఇచ్చారు మేజావా. గర్ల్‌ఫ్రెండ్ కోసం దరఖాస్తులకు ఆయన ఈ నెల 17 వరకు గడువు పెట్టారు.

దరఖాస్తు చేసుకున్న వారితో డేటింగ్‌లకు వెళ్తూ మార్చి నాటికి తుది ఎంపిక పూర్తి చేస్తారు. గతంలో మేజావా ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ కంపెనీ జోజోకి చీఫ్‌గా ఉన్నారు. దాన్ని యాహూకి అమ్మేశారు. ఓ పెయింటింగ్‌ని 11.05 కోట్ల డాలర్లు పెట్టి కొని వార్తల్లో నిలిచారు. అంతే కాదు సోషల్ ఎక్స్‌పరిమెంట్ పేరుతో ఇటీవల ఆయన తన వెయ్యి మంది ట్విట్టర్ ఫాలోవర్స్‌కి రూ.65 కోట్లు పంచి పెట్టి సంచలనం సృష్టించారు. ఇక అమ్మాయి దొరికితే స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో ప్రయాణం చేస్తాం. తమతో పాటు మరో ఆరుగురు కళాకారులను చంద్రమండల యాత్రకు తీసుకువెళ్తానని మేజావా ప్రకటించారు.

Similar News