మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

Update: 2020-01-24 09:33 GMT

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం… ప్రత్యేక ఆహ్వానం పంపింది. “కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్ననెన్స్ ఏట్ క్రాస్ రోడ్స్” పేరుతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సాధారణంగా ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులు మాత్రమే హాజరవుతారు. రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల్లో ఈ సమావేశానికి హాజరైన లీడర్‌ కేటీఆర్ ఒక్కరే కావడం విశేషం.ఈ సమావేశం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక బ్యాడ్జ్‌ను అందించింది.

ఈ సమావేశం ద్వారా ప్రపంచ లీడర్లు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వివిధ అంశాలపైన మాట్లాడే అవకాశాన్ని కల్పించింది వరల్డ్ ఎకానామిక్ ఫోరం...ఇందుకోసం వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్ కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేషియా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో పిరమల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌ సమావేశమయ్యారు. అనంతరం పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని తమ ఫార్మా యూనిట్‌ను రూ.500 కోట్లతో విస్తరిస్తామని తెలిపారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ ప్లాంట్లను హైదరాబాద్‌కు తరలించే అవకాశాలను పరిశీలిస్తామని పిరమల్‌ గ్రూప్‌ తెలిపింది. హైదరాబాద్‌లో ఉన్న ఇతర కంపెనీలను కొనుగోలు చేసి తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచ్చయ్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో గూగుల్‌ కార్యకలాపాలు, విస్తరణపై వారు చర్చించారు. ప్రముఖ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ సంస్థ ‘బీఏఈ సిస్టమ్స్‌’ చైర్మన్‌ సర్‌ రోజర్‌ కార్‌తో కూడా కేటీఆర్‌ సమావేశమయ్యారు.

Similar News