AP: ఏపీలో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు

జగన్‌ పాలనలో ప్రశ్నార్థకంగా సర్పంచుల పరిస్థితి... పంచాయతీల నిధులు మళ్లింపు

Update: 2024-04-30 02:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. గ్రామ సర్పంచుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గతంలో గ్రామానికి కావాల్సినవన్నీ వారే నిర్ణయించేవారు. గ్రామసభలో నిర్ణయాలు తీసుకునేవారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు ఆ అధికారం లేకుండా పోయింది. పంచాయతీల నిధులను మళ్లించుకుపోయిన సర్కారు గ్రామాభివృద్ధిని పక్కనపడేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్లు వేయించాలి..కాలువలు తవ్వించాలి. కానీ, నరేగా నిధులకు ఎసరు పెట్టిన జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు లాంటి భవనాల నిర్మాణాలకు ఇష్టారీతిన వాడేసింది. కేంద్రం ఆర్థిక సంఘం నిధులకూ గండికొట్టింది. ఆర్థిక సంఘం నిధులతో గతంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు చేసేవారు. కానీ, ఆ నిధులను విద్యుత్‌ బకాయిలు, ఇతర పిచ్చి లెక్కలు చెప్పి లాగేసింది వైకాపా ప్రభుత్వం. దీంతో పంచాయతీల ఖాతాలు ఖాళీ అయి.. పనులేమీ చేయలేక.. సర్పంచులు చిన్నబోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది.

గతంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులను సర్పంచులే ఎంపిక చేసేవారు. పథకాల అమల్లో వారే క్రియాశీలంగా వ్యవహరించేవారు. కాగా ప్రస్తుతం సర్పంచులకు ఆ సమాచారమే ఉండట్లేదు. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాల అమలు వరకు అంతా సచివాలయ ఉద్యోగులదే పెత్తనమైంది. నాడు..సర్పంచ్‌ అంటే గ్రామస్థులకు ఒక గౌరవం. శ్రద్ధ, నిబద్ధతతో పనిచేసే వారినైతే ప్రజలు మరింతగా అభిమానించేవారు. నేడు..గ్రామ వాలంటీర్‌కి ఉన్న గౌరవం కూడా సర్పంచ్‌ కు ఉండట్లేదు. నిధులన్నీ ప్రభుత్వం ఎత్తుకుపోవడంతో గ్రామాల్లో కనీస పనులూ చేయలేక, ప్రజలకు ముఖం చూపించలేక కుమిలిపోతున్నారు. భిక్షమెత్తు తూ, రోడ్లు ఊడుస్తూ, బూట్లు తుడుస్తూ వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. ఐనా.. జగన్‌ ప్రభుత్వంలో మార్పు రాలేదు.

ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు జగన్‌ ప్రభుత్వం గండికొట్టింది.14,15 ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచా యతీలకు వచ్చిన 8,629.79 కోట్లు వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది. చెక్‌ల మీద సర్పంచుల సంతకాలు లేకుండా, సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండా పంచాయతీల CFMS అకౌంట్ల నుంచి నిధులు దొంగలించి సొంత అవసరాలకు, పథకాలకు దారిమళ్లించిందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నా రు. ప్రభుత్వం అన్యాయంగా తీసుకున్న సొమ్మును తక్షణమే తిరిగి పంచాయితీల ఖాతాల్లో జమ చేయలని సర్పంచ్‌లు మూడేళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల 4,041 కోట్ల రూపాయల నిధులను కూడా పంచాయితీలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని సర్పంచ్‌లు అంటున్నారు. తక్షణమే ఆ నిధులను కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News