ఢిల్లీని తాకిన అమరావతి ఉద్యమం.. హస్తినా నేతలతో రైతులు

Update: 2020-02-04 20:14 GMT

అమరావతి ఉద్యమం ఢిల్లీని తాకింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వరుసగా మూడో రోజు కేంద్ర పెద్దలను అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో రాజధాని రైతులు, జేఏసీ నేతలు కలిశారు. మొదట ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని అమరావతి రైతుల కలిశారు. రాజధాని సమస్యలను వివరించారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసుల దాడులను ఉపరాష్ట్రపతికి వివరించారు. రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలించకుండా చూడాలని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తరువాత సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ను కలిశారు. రాజధానిలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని.. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చూడాలని కోరారు. తమపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.

మంగళవారం మరికొందరి కేంద్ర మంత్రులను అమరావతి జేఏసీ నేతలు, రైతులు కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించనున్నారు. అపాయింట్‌ మెంట్ దొరికితే మరికొంతమంది కేంద్ర మంత్రులతో పాటు.. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీలను కూడా కలిసే ఆలోచనలో అమరావతి రైతులు వున్నారు. వీలైతే సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను కూడా కలిసి సమస్యను వివరించేందుకు సిద్ధమయ్యారు అమరావతి రైతులు. ఇప్పటి వరకు తాము కలిసిన కేంద్రమంత్రులు, కేంద్ర పెద్దలు తమకు స్పష్టమైన హామీ ఇస్తున్నారని రాజధాని రైతులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం మారేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు.

Similar News